కాసులకోసం మెదక్ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల మోసం
గిరిజన, బడుగు మహిళలపై వల
వందల మందికి గర్భసంచి తొలగింపు
స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, నర్సాపూర్ న్యూస్‌టుడే
గతంలో గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ”మీ ఇంట్లో అందరూ బాగున్నారా? ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా?” అని అడిగేవారు. ఇప్పుడు ప్రభుత్వ వైద్య సేవలు పడకేశాయి. ఆ స్థానాన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆక్రమించాయి. మెదక్ జిల్లాలో ఇప్పుడు ప్రైవేటు వైద్యులు మహిళలు పనిచేసే చోటికి వెళ్లి ”నీకు గానీ, మీ ఇంట్లో ఎవరికైనా గానీ కడుపునొప్పి ఉందా?” అంటూ పలకరిస్తున్నారు. కడుపు నొప్పి ఉందంటే చాలు… అది కేన్సర్‌కు దారితీయవచ్చని భయపెట్టి ఆపరేషన్ చేసేస్తున్నారు. గర్భసంచిని తొలగించేస్తున్నారు. ఇందుకోసం అయిదు నుంచి పదివేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రత్యేకించి కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లు తమ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొంతమంది సర్జన్లు మెదక్ జిల్లాకు వెళ్లి మరీ డబ్బు కోసం ఈ శస్త్రచికిత్సలు చేసి వస్తున్నారు. అసలు స్త్రీవ్యాధి నిపుణుల (గైనకాలజిస్టు) సలహా లేకుండానే, కేవలం డబ్బే పరమావధిగా ఉత్తపుణ్యాన ఈ ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. దీనితో నిరుపేద మహిళల ఆరోగ్యం క్షీణిస్తోంది. తరచు నీరసంగా ఉండడం, ఎక్కువసేపు నిల్చోలేకపోవడం, చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కొంటూ వారు ఉపాధికి దూరమవుతున్నారు. సెంటర్ ఫర్ యాక్షన్ రీసెర్చ్ అండ్ పీపుల్స్ డెవలప్‌మెంట్ (CARPED) సంస్థ ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించగా… మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో 728 మంది మహిళలకు ఇలా హిస్టరెక్టమీ (గర్భసంచి తొలగింపు) ఆపరేషన్లు జరిగినట్లు తేలింది. వీరిలో అత్యధికులు బీసీ, గిరిజన మహిళలే. రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులపై ఎలాంటి నియంత్రణా లేకపోవడం, గతంలో తెచ్చిన చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు అమాయక మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి.
అధ్యయన వివరాలివీ…
* మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్, వెల్దుర్తి, జోగిపేట, సంగారెడ్డి, కౌడిపల్లి, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్లు జరిగాయి. 28 గ్రామాలకు చెందిన మహిళలు వీటిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు.
* ఒక్కో గ్రామంలో 10 నుంచి 55 మంది మహిళలకు గర్భసంచిని తొలగించారు.
* చాలామందికి చిన్న వయసులోనే ఈ ఆపరేషన్లు చేసేశారు. బాధితుల్లో 21-25 సంవత్సరాల మధ్య వయస్సు వారు 85 మంది, 26-30 మధ్య వయస్సు వారు 165 మంది ఉన్నారు.
* అసలు పిల్లలే లేని 21 మంది మహిళలకు కూడా గర్భసంచిని తీసేశారు.
* మొత్తం ఆపరేషన్లలో నాలుగో వంతుకు పైగా నర్సాపూర్‌లోని నర్సింగరావు ప్రైవేటు ఆసుపత్రిలోనే జరిగాయి. ఇక్కడ ఏకంగా 192 మందికి హిస్టరెక్టమీ చేశారు.
అనవసరం: వైద్యులు
రుతుక్రమం సరిగా లేకపోవడం, తెల్లబట్ట, అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి వంటి సమస్యలతో మహిళలు బాధపడుతుండడం సహజమే. చాలామందికి మామూలు యాంటీబయాటిక్స్, ఇతర మందులతోనే ఈ సమస్యల్ని తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గర్భసంచీ తొలగించడం తప్ప మరే మార్గమూ లేదని భావించినప్పుడు… అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హిస్టరెక్టమీ చేయాలని వారు పేర్కొన్నారు. అయితే ప్రైవేటు ఆసుపత్రుల వారు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలేవీ చేయకుండానే, కనీసం గైనకాలజిస్టు సలహా కూడా లేకుండానే బాధితులకు ఆపరేషన్లు నిర్వహించేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్స్, రక్తస్రావం, తెల్లబట్ట, పొత్తికడుపులో నొప్పి వచ్చినప్పుడు గైనకాలజిస్టును సంప్రదించాలని, నిపుణుల సలహా లేకుండా శస్త్రచికిత్సలు చేయించుకోరాదని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ వీణాకుమారి తెలిపారు.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల ఏర్పాటుపై ఎలాంటి నియంత్రణా లేదు. ఏ అర్హతలూ లేనివారు సైతం ఆసుపత్రిని ప్రారంభించి, ఓ డాక్టర్‌ను పెట్టుకుని పని నడిపించగల పరిస్థితి ఉంది. కొందరైతే దుకాణాలు పెట్టేందుకు లైసెన్సులు తీసుకుని ఆసుపత్రులు తెరుస్తున్నారు. దానితో వాటిపై నామమాత్రపు నియంత్రణకు కూడా అవకాశం లేకుండా పోతోంది.మెదక్ జిల్లాలో జరుగుతున్న ఈ దారుణాలపై జిల్లా కలెక్టర్‌ను ‘న్యూస్‌టుడే’ ప్రశ్నించగా ”దీనిపై మాకు ఎలాంటి ఫిర్యాదూ రాలేదు. మహిళలు స్వచ్ఛందంగా ఆపరేషన్లు చేయించుకున్నారు కాబట్టి మేం ఏమీ చేయలేం. అయితే ఆ ఆసుపత్రులపై నిఘా పెడతాం. మహిళల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తాం” అని చెప్పారు.
అవగాహన పెంచాలి
ఈ ఉదంతంపై అధ్యయనం చేస్తున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎంఎల్‌సీ డాక్టర్ రాజ్యలక్ష్మి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ… ఆరోగ్య పరిరక్షణ విషయంలో మహిళలను చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు తాము ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. గైనకాలజిస్ట్ సూచనలు, సలహాలు లేకుండా ఇటువంటి ఈ శస్త్రచికిత్సలు జరగడం అత్యంత ప్రమాదకరమని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
eenadu 29th June 2007
Leave a Comment
No comments yet.
Comments RSS TrackBack Identifier URI



