కుమ్మరి మట్టి రూపు మారింది

కుమ్మరి మట్టి రూపు మారింది

ఇదివరకు ఎండాకాలం వచ్చిందంటే చాలు ఊరు ఊరంతా కుమ్మరివాడ వైపు అడుగులు వేసేది.
తొలి పండగ ఉగాదికి కొత్తకుండలో పచ్చడి పెట్టాల్సిందే. పెళ్లికి బాజాభజంత్రీల కన్నా ముందుఐరోన్ల‘ (కుండల) కోసం కుమ్మరికి పని పురమాయించని ఇల్లు వుండేది కాదు. మట్టినే నమ్ముకుని కుండలు చేసే కుమ్మరి వాడలు ఒకప్పుడు యేడాది పొడవునా చల్లగా వుండేవి.
కాలం మారింది. కులవృత్తులకు కాలం చెల్లింది. కుండల స్థానంలో వచ్చిన ఫ్రిజ్‌లు వారి జీవితాలపై మట్టిగొడితే, బిందెలు, వాటర్‌ ఫిల్టర్లు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. అయినా సరే సారె తిప్పిన కుమ్మరి కాలచక్రంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మారుతూ అస్తిత్వపోరాటం చేస్తూనే వున్నాడు. కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌ నగరంలో సైతం కుమ్మరి వాడలు మట్టివాసనల పరిమళంతో గుబాళిస్తూనే ఉన్నాయి. కుండలు, కూజాలు, పూల కుండీలకు బదులుగా తందూరీ బట్టీలు సారెపై గిర్రున తిరుగుతున్నాయి. అవే వారి బతుకు చక్రానికి బాసటగా నిలుస్తున్నాయి. ఇలాంటి కుమ్మరివాడలు ఊళ్లలో కనుమరుగవుతున్నామెగాసిటీలో ఇప్పటికీ తమ ఉనికిని చాటుకుంటున్నాయి.

సుదీర్ఘ చరిత్ర కలిగిన హైదరాబాద్‌ సంస్థానంలో కుమ్మరివాడలకు ప్రత్యేక స్థానం వుంది. అప్పట్లో నగర ప్రజలకు అవసరమైన కుండలు, ఇతర పాత్రలు తయారుచేసేందుకు అనేక కుమ్మరివాడలు వెలిశాయి. ఆసిఫ్‌నగర్‌, కార్వాన్‌, లాల్‌దర్వాజ, మలక్‌పేట, గోల్నాకా, అంబర్‌పేట, నారాయణగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట, సరూర్‌నగర్‌, చిలుకానగర్‌, ఉప్పల్‌, రామంతపూర్‌, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, బాలానగర్‌, చాంద్రాయణగుట్ట, ఘట్‌కేసర్‌, కుషాయిగూడ, రాయదుర్గం, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో ఈ కుమ్మరివాడలు కనిపిస్తాయి. ఆనాడు నగరంలో వుండే కుమ్మర్లు సరిపోకపోవడంతో చుట్టుపక్కల జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పిలిపించాల్సి వచ్చిందట. స్వయంగా ప్రభుత్వమే తోడ్పాటు అందించి మరీ పిలిపించిందట. అప్పటినుంచి వీరు కుండలు, పూలకుండీలు, దీపాంతలు, కూజాలు, సాంబ్రాణి పాత్రలు, జాంరాళ్ళు ఇతరత్రా వంట సామాగ్రిని తయారుచేసి విక్రయించేవారు. ఇదే వారి జీవనాధారం. అయితే రాను రాను నగర సంస్కృతి మారడం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో నగరజీవి కుండలు కొనటం మానేశాడు. వాటి స్థానంలో వెల్లువలా వచ్చిన ఫ్రిజ్‌లు, వాటర్‌ ఫిల్టర్లు, బిందెలు కుమ్మరిని వెక్కిరించాయి. వేసవికాలంలో మాత్రమే కుండల అమ్మకాలు ఓ మోస్తరుగా వుండటంతో క్రమక్రమంగా కుమ్మరి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. దీంతో సహజంగానే చాలామంది ఈ కులవృత్తికి స్వస్తి పలికి వేరే పనులు చూసుకోగా, మిగతావారు ఇదే వృత్తిలో కొనసాగుతూ ట్రెండ్‌ను బట్టి తమ ఉత్పత్తులను మార్చుకోసాగారు.

మారిన అభి’రుచి’
నగరవాసుల్లో మారిన అభిరుచి కుమ్మరి కుటుంబాలకు కొత్త దారిని చూపింది. నగరంలోని అనేక హోటళ్లు భోజనప్రియులకు రకరకాల రుచులను పరిచయం చేస్తున్నాయి. వీటిలో ‘తందూరీ’ రుచే వేరు. నూనె లేకుండా కాల్చే తందూరీ రొట్టెతో పనీర్‌ బట్టర్‌ మసాలానో, జింజర్‌ చికెనో నంజుకోవడంలో వున్న మజా దేనిలోనూ వుండదు. అదేవిధంగా కాబాబ్స్‌, టిక్కాలు…ఇలా ఒకటేమిటీ తందూరీ ఐటెమ్స్‌ రుచే వేరు. అందుకే నగరంలో తందూరీకి గిరాకీ బాగా పెరిగింది. రుచికరమైన తందూరీ రోటీ తయారుకావాలంటే తందూరీ బట్టీ తప్పనిసరి. ఫలితంగా కుమ్మరులు కుండలకు స్వస్తిపలికి తందూరీ బట్టీల తయారీలో బిజీగా మారారు. ఆసిఫ్‌నగర్‌లోని కుమ్మరివాడకు వెళ్తే వందలాది తందూరీ బట్టీలు రోడ్లపై కనిపిస్తాయి. ఇక్కడ సుమారు అరవై కుటుంబాలు వీటినే జీవనాధారంగా చేసుకున్నాయి. నగరశివార్లలో దాబాలు కుప్పలు తెప్పలుగా వెలవడంతోపాటు పలు జిల్లాకేంద్రాలు, పట్టణాల్లో సైతం హోటళ్ల సంఖ్య పెరగడం వీరికి వరంగా మారింది. స్టార్‌ హోటళ్లలో సైతం తందూరీ బట్టీ వుండాల్సిందే. ఇక పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్లలో కూడా వేడి వేడి తందూరీ రొట్టెలు అక్కడికక్కడే తయారుచేయడం లేటెస్ట్‌ ట్రెండ్‌గా మారింది. దీంతో ఈ రకమైన బట్టీలకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో కుమ్మరివాడలన్నీ తందూరీ బట్టీలతో నిండిపోతున్నాయి. ప్రస్తుతం వీరంతా ఇరవై శాతం కుండలు తయారుచేస్తే ఎనభైశాతం బట్టీలనే తయారుచేస్తుండటం గమనార్హం.

ఎలా తయారుచేస్తారు?
తందూరీ బట్టీల తయారీకి బంకమన్నును మాత్రమే వాడతారు. శంషాబాద్‌ మండంలోని పలు గ్రామాలనుంచి ఈ మట్టిని కొనుగోలు చేస్తారు. ఒక లారీ మట్టికి రెండున్నర వేలు చెల్లిస్తామని తయారీదారులు చెబుతున్నారు. లారీ మట్టితో వివిధ సైజుల్లో ఆరువందల నుంచి వెయ్యి బట్టీల దాకా తయారవుతాయి. శంషాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల నుంచి కూడా ఈ మట్టి పలు కుమ్మరివాడలకు వెళ్తుంది. ఈ మట్టిలో నీళ్లు పోసి నానబెట్టి బాగా తొక్కి మెత్తగా చేస్తారు. తర్వాత సారె (చక్రం) మీద మట్టిని పెట్టి తందూరీ బట్టీ ఆకారంలో తయారుచేసి ఎండపెడతారు. బాగా ఎండిన తర్వాత వాటిని ఆములో పెట్టి దానిపై ఎండుగడ్డి, పిడకలు, కట్టెలను పేర్చి, నిప్పంటించి బాగా కాల్చుతారు. ఆము చల్లారిన తర్వాత తందూరీ బట్టీలను బయటకు తీసి జాజు, ఎరుపురంగు పూస్తారు. ఒకరోజు రెండుకు మించి తయారుచేయలేమని కుమ్మరులు చెబుతున్నారు. పెద్ద బట్టీ తయారీకి రెండు రోజుల సమయం తీసుకుంటారు. వీటి తయారీలో కుమ్మరి కుటుంబాలు మొత్తం పాల్గొంటాయి. ఉద్యోగం చేసేవారు, చదువుకునేవారు ఉదయం సాయంత్రం వేళలో ఈ పనులు చేస్తుండగా, మిగతా కుటుంబసభ్యులు రోజంతా బట్టీల తయారీలో పాలుపంచుకుంటారు. మహిళలు వీటిని అమ్మే బాధ్యతను తీసుకుంటారు. నెలకు ఒక్కో కుటుంబం సుమారుగా తొమ్మిది వేల రూపాయల అమ్మకాలు జరుపుతుండగా వీరికి గిట్టేది మాత్రం ఖర్చులుపోను నాలుగైదు వేలకు మించి ఉండటం లేదు.

సైజును బట్టి రేటు
తందూరీ బట్టీల్లో కూడా రకరకాల సైజులుంటాయి. స్టార్‌హోటల్స్‌, దాబాలు, హోటళ్లు తమకున్న స్థలాన్ని బట్టి వివిధ సైజుల్లో ఆర్డర్లు ఇస్తుంటాయి. అందుకే సైజును బట్టి మూడు వందల నుంచి మూడువేల వరకు ఈ బట్టీలు రేటును పలుకుతాయి. ఇక పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్లకు డిఫరెంట్‌ బట్టీలను తయారుచేస్తుంటారు. ఇనుపడ్రమ్ముల్లో చేసే బట్టీలను ఎక్కడికైనా పట్టుకెళ్లే సౌకర్యం వుంటుంది. ఈ డ్రమ్ముల కింద చక్రాలు ఫిట్‌ చేయడంతో రవాణా సులువవుతుంది. డ్రమ్ముకి, తందూరీ బట్టీకి మధ్య సీసాపెంకులు, ఉప్పు వేయడం వలన వేడి అధికం అవుతుందనికూడా చెపుతారు వాళ్లు.

విదేశాలకు ఎగుమతి
నగరంలో తయారవుతున్న తందూరీ బట్టీలు వివిధ జిల్లాలు, ఇతర ర్రాష్టాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. అంతేగాక దుబాయి, కువైట్‌ వంటి మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం విశేషం. మన రాష్ట్రం విషయానికొస్తే విజయవాడకు ఈ బట్టీలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి. నగరంలో పాతికదాకా కుమ్మరివాడలు వుండగా ఒక్క ఆసిఫ్‌నగర్‌దే ఈ బట్టీల తయారీలో అరవైశాతం వాటా. ప్రతీరోజూ ఇక్కడినుంచి ఏదో ఒకచోటికి తందూరీ బట్టీలు ఎగుమతి అవుతూనే వుంటాయి. దానికి తగ్గట్టుగా గడ్డితో చాలా జాగ్రత్తగా ప్యాక్‌ చేస్తారు.

భవిష్యత్తు మాటేమిటి?
భాగ్యనగరం చుట్టుపక్కల భూములకు రెక్కలు వస్తుండటంతో క్రమక్రమంగా కుమ్మరివాడల ఉనికి ప్రమాదంలో పడింది. నగరం నలుదిశలా అనూహ్యంగా వ్యాపించడంతో చెరువులు పూడిపోయాయి. పొలాలు కనుమరుగైపోయాయి. దీంతో వంద కిలోమీటర్ల దూరం వెళ్లి బంకమట్టిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఈ కులవృత్తిని స్వీకరించేందుకు యువతరం అనాసక్తిని ప్రదర్శిస్తోంది. తమ తర్వాతి తరం ఈ వృత్తిని కొనసాగించే అవకాశాలు లేవని స్వయంగా కుమ్మరి కులస్థులే చెబుతున్నారు. బట్టీలు పెట్టాలంటే విశాలమైన స్థలం అవసరం. కుంచించుకుపోతున్న కుమ్మరివాడల్లో ఇది పెద్ద సమస్యగా మారుతోంది. అంతేగాక కుండలు కాల్చేందుకు ఉపయోగించే కలప, గడ్డి, పిడకలు కూడా దొరకడం గగనమయ్యింది. అయినా సరే మార్పులను అవగాహన చేసుకున్న కుమ్మరులు మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త వస్తువులు తయారుచేస్తూ మట్టి పరిమళాలను నలుదిశలా వ్యాపింపజేస్తూ ముందుకు సాగడం విశేషం.

సైజు ఏదైనా సరే..

కస్టమర్‌కు తందూరీ బట్టీ సైజును బట్టి తయారుచేసి ఇస్తాం. మట్టితోనే చేయాలి కాబట్టి ఎంత సైజులో కావాలన్నా తయారుచేసుకోవచ్చు. నెలకు దాదాపుగా ఇరవై నుంచి యాభై బట్టీల వరకు విక్రయిస్తాం.

-లావణ్య

మట్టితోనే ఇబ్బంది

తందూరీ బట్టీలు, కుండల తయారీకి బంకమట్టి ప్రధాన సమస్యగా మారింది. మట్టి కోసం వంద కిలోమీటర్లదాకా వెళ్లాల్సి వస్తోంది. ఒకప్పుడు వంటలన్నీ కుండలు, అటికెలలో చేసేవారు. కానీ నేడు ఆధునిక వంటపాత్రలు వచ్చాయి. మా కులవృత్తిని నిలుపుకునేందుకు బట్టీల తయారీకి మారాము. వీటి మోజులో పడి కుండలు తయారు చేయడం మానేశారు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూనే ఈ కులవృత్తిని చేస్తున్నాను. ఈతరం పిల్లలకు ఓపిక వుండటం లేదు. భవిష్యత్తులో కుండలు, బట్టీలు దొరకడం కష్టమే.

-సాయిలు, తయారీదారుడు

ఈ వృత్తినే నమ్ముకున్నాం

మా ఇంట్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఈ వృత్తిలోనే వున్నాం. మగవారు కుండలు చేస్తే, మేము వాటిని అమ్ముతుంటాం. తెల్లవారు జామునే పనిలోకి దిగుతాం. కుండలు ఎవరూ కొనడం లేదు. అందుకే బట్టీల తయారీ మొదలెట్టాం. ఇదే మా జీవనాధారం.

-సుశీల

స్థలం కావాలి

కుమ్మరివాడల్లో కుండలు, బట్టీల తయారీకి, కాల్చేందుకు ఇబ్బందులు చాలానే వున్నాయి. ఉన్న స్థలం సరిపోవడం లేదు. కుమ్మరివాడలకు ప్రభుత్వం ఎక్కడైనా స్థలం కేటాయించాలి. లేదంటే వీటి తయారీ మరింత తగ్గే అవకాశం వుంది.

-కిశోర్‌, తయారీదారుడు

-విష్ణుకుమార్‌ జెట్టి, ఆన్‌లైన్‌, మెహిదీపట్నం
-గోస్కి లింగం, ఆన్‌లైన్‌, లంగర్‌హజ్‌
ఫోటోలు: హరి

source : aandhrajyothy 1 jun 2008 sunday special

1 Comment(s)

  1. andaru kummarla lo ikyatha ravali oka maha udyamam cheyyali, appude kummarla baadhalu lokaniki telustayi…….


Comments RSS TrackBack Identifier URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.