6500 బడుల్లో సీబీఎస్‌ఈ బోధన
4121 పాఠశాలల్లోని ఆరు, ఏడు తరగతుల తరలింపు
మూసివేత లేదు: ఉత్తర్వుల జారీ
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా 6500 ఉన్నత పాఠశాలల్లో సీబీఎస్‌ఈ మాథ్యమంలో ఆంగ్ల బోధన చేబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదిలోనే దీనిని ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకించినా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మాత్రం సీబీఎస్‌ఈలో 2008-09 విద్యా సంవత్సరం నుంచి 6500 పాఠశాలల్లో బోధనను ప్రవేశపెడుతూ జి.ఒ.నెం.76 ద్వారా మంగళవారం ఉత్తర్వులను జారీచేసింది. ముఖ్య కార్యదర్శి సీబీఎస్ వెంకటరమణ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం… గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆంగ్లంలో బోధనను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2003-04 ప్రాంతంలో హైదరాబాద్, రాష్ట్రంలోని కొన్ని మున్సిపాల్టీలు తమ పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశపెట్టాయి. 2006లో చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలోని జిల్లా పరిషత్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఆంగ్ల బోధన సంతృప్తికరంగా ఉంది. దీనిపై సదస్సుల ద్వారా సేకరించిన సమాచారంతో కొత్త విద్యా సంవత్సరం నుంచి ‘సక్సెస్’ (కేంద్ర ప్రభుత్వ పథకం) కింద గుర్తించిన 6500 ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియంకు సమాంతరంగా సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళికతో ఆంగ్లంలో ఇంటర్మీడియట్ వరకు బోధిస్తారు. కొత్త విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో చేరే విద్యార్థి ఇంటర్‌కు చేరుకునేలోపు (సంవత్సరాల వారీగా) సౌకర్యాలు కల్పిస్తారు. ఈ పాఠశాలలను పూర్తిస్థాయిలో పటిష్ఠంచేస్తారు. ఈ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పథకం కింద ప్రవేశపెడతారు. అదనపు తరగతులకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం వంటి వాటిగురించి చర్యలను తీసుకుంటున్నారు.
ఆరేడు తరగతుల తరలింపు: ఈ ఉన్నత పాఠశాలలకు రెండు కిలోమీటర్ల దూరంలో 4121 ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఆరేడు తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనంచేస్తారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం,అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉన్నత పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. అయితే పాఠశాలలు మూసివేయడం మాత్రం జరగదు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధన అలాగే కొనసాగుతుంది. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు తరలించిన ఉపాధ్యాయులను బదిలీల కౌన్సెలింగ్‌లో ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులుగానే పరిగణించి ‘స్టేషన్ సీనియార్టీ’ని నిర్ణయిస్తారు.
ఉపాధ్యాయులకు శిక్షణ: ఆంగ్ల మాథ్యమంలో ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యం పెంపొందించేందుకు తరచు బోధన గురించి శిక్షణ ఇస్తారు. ప్రావీణ్యం కలిగిన 40 లేదా 45 మంది ఇంగ్లీష్ స్కూలు అసిస్టెంట్లతో జిల్లాకో రిసోర్స్ గ్రూపును ఎంపికచేసి, దీర్ఘకాలిక శిక్షణ ఇస్తారు. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబరేటరీలను, అన్ని జిల్లాలోనూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్స్‌ను ప్రారంభిస్తారు. కొన్ని జిల్లాల్లో ఉన్న ‘జిల్లా ఆంగ్ల కేంద్రాల’ను పటిష్ఠంచేస్తారు. ఇవి లేని మూడు జిల్లాల్లో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. ఉపాధ్యాయులకు అవసరమైన పుస్తకాలు పంపిణీచేస్తారు. నెలలో రెండో శనివారం, ఆదివారం ఉపాధ్యాయులకు శిక్షణను కొనసాగించే విషయాన్ని పరిశీలిస్తారు.
source : eenaadu 11 June 2008
No Comments Yet
No comments yet.
Comments RSS TrackBack Identifier URI
Leave a comment



