బడిగంట గణగణ

బడిగంట గణగణ
 
(ఆన్‌లైన్‌ ప్రతినిధి, సంగారెడ్డి) ఎప్పటిలాగే.. ఎన్నో సమస్యలతో..విద్యాసంవత్సరం గురువారం నుంచి మొదలవుతున్నది. ప్రాథమిక స్థాయి నుంచి విద్యావ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని పాలకులు ప్రకటించడం తప్ప ప్రభుత్వ పాఠశాలలకు ఒనగూరుతున్న ప్రయోజనాలు కనిపించడం లేదు. ఏఏటికాఏడు పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కనీస వసతులైన గదులు, ఫర్నిచర్‌, ఉపాధ్యాయుల కొరతతో పాటు తాగునీటికి, టాయ్‌లెట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2182 ప్రాథమిక పాఠశాలల్లో సుమారు మూడు లక్షలపై చిలుకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.

అదేవిధంగా 570 ప్రాథమికోన్నత పాఠశాలల్లో లక్షపైచిలుకు, 654 ఉన్నత పాఠశాలల్లో మరో లక్షా అయిదు వేల మంది విద్యార్థులు నేటి నుంచి చదువుకోనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో వందల సంఖ్యలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు మచ్చుకైనా లేవంటే ఆశ్చర్యం కలగకమానదు. కాకపోతే మంత్రి రాజనర్సింహ కృషితో గత విద్యాసంవత్సరంలో జిల్లాకు పెద్దఎత్తున మంజూరైన ఫర్నిచర్‌ను ప్రథమ ప్రాధాన్యతగా ఆయన తన అందోలు నియోజకవర్గంలోని దాదాపు అన్ని పాఠశాలలకు సమకూర్చారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలోని పాఠశాలల్లో ఫర్నిచర్‌ కొరత స్పష్టంగా ఉన్నది. జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉన్న గదులలో 811 గదులకు ఇంకా మరమ్మతులు చేయాల్సి ఉన్నది. రాజీవ్‌ విద్యామిషన్‌ వార్షిక ప్రణాళిక ప్రకారం పాఠశాలల్లో నలబై మంది విద్యార్థులకు ఒక గది చొప్పున ఉండాలి. ఆ మేరకు ప్రస్తుతమున్న పాఠశాలల్లో అదనంగా 1726 గదులు అవసరమున్నాయి. ఇందులో రాజీవ్‌ విద్యామిషన్‌ నుంచి 180 గదుల నిర్మాణం చేపట్టగా, ఇందిరమ్మ పథకం మొదటి ఫేజ్‌ కింద 814 గదులు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు నాలుగు వందల గదుల నిర్మాణాలే పూర్తయ్యాయి.

అలాగే ఇందిరమ్మ పథకం రెండో విడతలో 666 గదుల నిర్మాణం మంజూరు చేయాల్సి ఉండగా, 180 గదుల నిర్మాణాలకే మంజూరయ్యాయి. ఇక కనీస వసతుల విషయానికి వస్తే 984 పాఠశాలల్లో మరుగుదొడ్లు, 955 పాఠశాలల్లో మంచినీటి సదుపాయం కల్పించాల్సి ఉన్నది. అలాగే మధ్యాహ్నభోజన పథకం అమలు చేస్తున్న పాఠశాలల్లో 1797 పాఠశాలకు వంటగదులు నిర్మించాల్సి ఉన్నది. పాఠశాలల్లో కనీస సదుపాయాలకల్పనకు అవసరమైన నిధులు రాజీవ్‌ విద్యామిషన్‌లో అందుబాటులో ఉన్న వాటిని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసేందుకు సరైన యంత్రాంగం లేకపోవడమే సమస్యలను తెచ్చిపెడుతున్నది. అందుకే నారాయణఖేడ్‌, నర్సాపూర్‌, మెదక్‌, జహీరాబాద్‌ తదితర ప్రాంతాలలోని అనేక పాఠశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి.

ఏపాఠశాల చూసినా శిథిలమైన భవనమో.. పూరిగుడిసెనో.. తాగునీరు లేకనో.. టాయ్‌లెట్లు లేకనో.. కనిపిస్తాయి. మచ్చుకు నారాయణఖేడ్‌ ప్రాంతంతో పాటు మెదక్‌ పట్టణం, చేగుంట, నర్సాపూర్‌ మండలం బిక్యాతండా, బాల్యాతండా, వాల్యా తండాలలోని పాఠశాలలను చూస్తే ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. విద్యాబోధన విషయానికి వస్తే జిల్లాలోని తరగతులకు అనుగుణంగా ఉండాల్సిన ఉపాధ్యాయులకన్నా సుమారు నాలుగు వేల ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. 2006 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులను కలుపుకుని జిల్లా వ్యాప్తంగా పదకొండు వేల మంది ఉపాధ్యాయులున్నారు. అయినా ఉన్నత పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన కావించేందుకు గణితం, ఇంగ్లీషు, సైన్స్‌ సబ్జక్టులలో స్కూల్‌ అసిస్టెంట్ల కొరత చాలా ఉన్నది. ఈ కొరత అధిగమించకుండా విద్యార్థులలో విద్యాప్రమాణాలు పెంపొందింపజేసేందుకు చేస్తున్నామని చెబుతున్న ప్రయత్నం ప్రయత్నంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. .

ఇంగ్లీషు బోధనతో ఇబ్బందులే ఇదిలాఉండగా ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి 230 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరవ తరగతి నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతమున్న 570 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 170 పాఠశాలలను మూసేశారు. వాటి స్థానంలో అయిదో తరగతి వరకు ఉండేలా ప్రాథమిక పాఠశాలలను కనసాగిస్తున్నారు. ఈ పాఠశాలల్లో తీసేసిన ఆరు, ఏడు తరగతులను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. అంటే ఆ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు రోజు రెండు కిలోమీటర్ల దూరం నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీనికి తోడు సిీబీఎస్‌ఇ సిలబస్‌తో విద్యాబోధన కావిస్తామంటున్న ప్రభుత్వ వైఖరిని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. అసలే ఉపాధ్యాయుల కొరత ఉండగా, వారిలో కొందరికి శిక్షణ ఇచ్చి ఇంగ్లీషు మీడియంలో బోధన కావింపజేయనుండడం ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో అధికారులకే తెలియాలి. ఈ పరిస్థితులలో సుమారు నాలుగు వేల మంది విద్యావాలంటీర్లను నియమించాల్సి ఉన్నది. సాధారణంగా విద్యా సంవత్సరంలోనే విద్యావలంటీర్లను నియమిస్తే బోధనకు అంతరాయం ఉండదు. కాని జిల్లాలో విద్యావలంటీర్లను నియమించేందుకు మరో రెండు మూడు నెలలైనా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

.్రపైవేట్‌ జోరు ప్రభుత్వ పాఠశాలల తీరు ఇలాఉంటే ్రపైవేట్‌ పాఠశాలల జోరు ఎప్పటిలాగే ఈ సారి కొనసాగుతున్నది. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 1550 ప్రాథమిక పాఠశాలలు, 175 ప్రాథమికోన్నత పాఠశాలలు, 155 ఉన్నత పాఠశాలల్లో గత నెల రోజుల కిందటే అడ్మిషన్లు మొదలయ్యాయి. ఈ పాఠశాలల యాజమాన్యాలు ఫలితాలతో ప్రకటనలు ఇచ్చి, విద్యార్థుల తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయా స్థాయిలలోని అన్ని ్రపైవేట్‌ పాఠశాలల్లోనూ సీట్ల సంఖ్యకు అనుగుణంగా అడ్మిషన్లు పూర్తయ్యాయి.

తరగతిని బట్టి యాజమాన్యాలు నిర్ణయించిన డొనేషన్‌ డబ్బులను కూడా కట్టేందుకు తల్లిదండ్రులు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఉత్తమ విద్యాబోధనను దృష్టిలో పెట్టుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను అందుబాటులో ఉన్న ్రపైవేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ్రపైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు వాహనాలలో ప్రచారం చేయడంతో పాటు పట్టణాలలో టీచర్లను ఇంటింటికి తిప్పుతున్నారు. తమ పాఠశాలలో ఫలితాలు, విద్యాబోధన గురించి వారు చెబుతూ, విద్యార్థులను చేర్పించాలంటూ తల్లిదండ్రులను కోరుతుండడం.. విద్య వ్యాపారంగా ఎలా మారింది తెలుస్తున్నది.

source : aandhrajyothy, medak, 12 june 2008

No Comments Yet

No comments yet.

Comments RSS TrackBack Identifier URI

Leave a comment