home schooling

ఇల్లే బడి
పిల్లల్ని బడిలో చేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఎన్నెన్నో ప్రశ్నలు! ప్రభుత్వ పాఠశాలా… ప్రైవేటా? స్టేట్‌ సిలబస్సా… సీబీఎస్సీనా? ఆంగ్ల మాధ్యమమా… తెలుగా? ఎన్నో ఆలోచించి మేలైనదనుకున్న పాఠశాలలోనే చేర్పించినా… ఇంకా ఏదో అసంతృప్తి కొందరిని వేధిస్తుంటుంది. నర్సరీనుంచి పదోతరగతి వరకు ఏకంగా పదమూడేళ్లపాటు పిల్లలు స్కూలుకెళ్తారు. సమయం, పాఠ్యాంశాలు, పరీక్షల ఫ్రేముల్లో పిల్లల్ని అన్నేళ్లపాటు బంధించడం అవసరమా… అని ప్రశ్నిస్తోంది ఒక వర్గం. మా పిల్లలకు ఇల్లే బడి. మేమే ఉపాధ్యాయులం… అంటున్న తల్లిదండ్రులు ఇప్పుడు మనదేశంలోనూ ఎక్కువవుతున్నారు.
అవును… నిజమే! పిల్లల్ని బడికి పంపకుండా ఇంట్లోనే చదువుచెప్పే హోం స్కూలింగ్‌ ఇప్పుడిప్పుడే మనదేశంలోనూ ఆదరణ పొందుతోంది. అందుకు సాక్ష్యం… ఈ వెబ్‌సైట్‌: www.alternativeeducationindia.net. మనదేశంలోని వివిధ పాఠశాలల్లో పనిచేసిన అనుభవం, తన ఇద్దరు పిల్లలకు పదేళ్లపాటు తానే ఉపాధ్యాయులు కావడం… వెరసి ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించేలా చేసింది న్యూజిలాండ్‌కి చెందిన క్త్లెవ్‌ ఎల్వెల్‌ని. చట్టపరంగా ఈ విధానం అనుమతించదగినదేనా అన్నదగ్గర్నుంచీ ప్రత్యామ్నాయ పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, హోమ్‌ స్కూలింగ్‌ ఆచరిస్తున్న ఇతర తల్లిదండ్రులతో అనుభవాలు పంచుకోవడం వరకు ఎన్నో అంశాలు ఇందులో పొందుపర్చారాయన. రోజుకొక్కరు చొప్పున తమ బృందంలో చేరుతున్నారంటారు క్త్లెవ్‌.
తొమ్మిదేళ్ల షాలోం ఏడాది క్రితం ఒకరోజు తానూ మిగతా పిల్లల్లా యూనిఫామ్‌ వేసుకుని స్కూలుకు వెళ్తానంది. అల్మారా అంతా వెదికి గళ్ల స్కర్టు, టీషర్టు వేసుకుని వాకిట్లో చెట్టుకింద ఉన్న పాఠశాలకు మూడు రోజులు వెళ్లిందో లేదో… డ్రస్‌ తీసి విసిరికొట్టింది. అమ్మ దగ్గరికి వెళ్లి ‘రోజూ ఒకే డ్రస్‌ ఎలా ధరిస్తారమ్మా? నావల్ల కాదు…’ అంటూ ఫిర్యాదుచేసింది. షాలోం బడికి యూనిఫామ్‌ అక్కర్లేదు. తరగతి గది కూడా ఒక్కచోట కాదు. పెరట్లో చెట్టుకింద, వంటింట్లో, ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న చిన్న గ్రంథాలయంలో… ఏరోజు ఎక్కడ కూర్చోవాలనిపిస్తే అక్కడ. ఏం చదవాలనిపిస్తే అది చదువుతుంది. ఒక్కోరోజు తల్లితో మార్కెట్‌కెళ్లి కొద్దికొద్దిగా కొనుగోలు వ్యవహారాలు నేర్చుకుంటుంది. ‘ఒక్కమాటలో చెప్పాలంటే మా అమ్మాయి ఇంటి దగ్గరే చదువుకుంటోంది… కానీ ప్రపంచమంతా ఆమెకు పాఠశాలే’ అంటుంది షాలోం తల్లి సంగీత. బెంగుళూరుకు చెందిన ఈ గృహిణే కాదు… ఇంకా చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో ఈ ప్రయోగం చేస్తున్నారు.
బందిఖానా మా పిల్లలకొద్దు!
ఈ పద్ధతిని ఇష్టపడుతున్నవారందరికీ సంప్రదాయ విద్యావిధానమంటే అయిష్టం. వాళ్లంతా అందులోనుంచి వచ్చినవాళ్లే అయినా సరే. చాలా తక్కువ పాఠశాలలు మాత్రమే పిల్లల అభీష్టానికి తగ్గట్లో, పిల్లలకు అవసరమైన విషయానికి తగ్గట్లో ఉంటాయంటారు వారు. అందుకే తమ పిల్లలకోసం ఈ పద్ధతినెంచుకుంటున్నారు. హోమ్‌ స్కూలింగ్‌ అనేది అమెరికాలో చాలాకాలంగా ఉంది. స్కూలు పద్దతులు, మతపరమైన నియమాలు, అతి క్రమశిక్షణ, క్రమశిక్షణారాహిత్యం, పరీక్షల పేరుతో పిల్లలను ఒత్తిడికి గురిచేయడం, కదలకుండా గంటల తరబడి గదుల్లో బంధించడం… ఇలాంటివి నచ్చని తల్లిదండ్రులు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు. 1990ల తర్వాత చాలా రాష్ట్రాల్లో దీన్ని చట్టబద్ధం చేయడంతో విపరీతంగా ఆదరణ పొందుతోంది ఈ విధానం. ఇంటిని, అమ్మ ఒడిని బడిగా భావించడమంటే… ఆషామాషీ వ్యవహారం కాదు. పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యత నెత్తినేసుకోవడమే.
తేలికైన నిర్ణయం కాదు!
ఈ విధానానికి ఓటేస్తున్న తల్లిదండ్రులు హఠాత్తుగా నిర్ణయించుకోవడం లేదు. దాని వెనక ఎంతో కసరత్తు జరుగుతోంది. ఉదాహరణకు బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆనంద్‌ అమెరికానుంచి ఇక్కడికి వచ్చారు. పన్నెండేళ్ల తమ కవల పిల్లల్ని చేర్పించడానికి మంచి ప్రత్యామ్నాయ పాఠశాలకోసం వెదికారు. ఒకదాన్ని ఎంచుకుని చేర్పించినా చదువు విషయంలో ఎదురవుతున్న ఒత్తిడి గమనించాక మాన్పించి స్వయంగా ఇంట్లో చదివించుకోవడం మొదలెట్టారు. అమెరికాలో వాల్‌డార్ఫ్‌ స్కూల్లో తమ చిన్నారిని చదివించిన శ్రీనివాసన్‌ దంపతులు మూడేళ్లక్రితం భారత్‌ వచ్చారు. ఇక్కడ మామూలు స్కూలుకు పాపాయిని పంపే ధైర్యం తమకు లేదంటారు వాళ్లు. సంగీత అయితే ఇవేమీ ఆలోచించలేదు. షాలోంకి చిన్నప్పుడు అందరు అమ్మల్లాగే తానూ చదువుచెప్పింది. సరిగ్గా ఆమె బడికెళ్లాల్సిన సమయానికి సంగీతకు రెండోసంతానం కలిగింది. బాబుని విడిచి స్కూలుకు వెళ్లడానికి అక్కకు మనస్కరించేది కాదు. ఆమెను ఏడ్పించడం ఇష్టంలేక సంగీత బలవంతం చేయలేదు. అలా ఇప్పుడు ఇద్దరు పిల్లలూ ఇంట్లోనే చదువుకుంటున్నారు. ‘మనం మాట్లాడడం ఆపితే పిల్లల మాట వినపడుతుంది. మనుషులకు చదువు ఎవరూ నేర్పనక్కర్లేదు… కాస్త ప్రేరణ చాలు..’ అంటారు ముంబయికి చెందిన వ్యాపారస్తుడు హేమంత్‌ఛాబ్రా. బెంగుళూరుకే చెందిన రామ్‌జీ శ్రీనివాసన్‌ అయితే కెరీర్‌ బ్రేక్‌ తీసుకుని మరీ హోమ్‌ ఎడ్యుకేటర్స్‌ని అందరినీ ఒక్కతాటిమీదకు తెచ్చేందుకు కృషిచేస్తున్నారు.
ఏ ఒత్తిడీ లేదు…
ఇంటిబడిలో పిల్లలు వాళ్లకు ఎప్పుడు ఏ అంశం చదవాలనిపిస్తే అది చదువుతారు. రోజూ రెండు, మూడు గంటలు చదువుకోసం కేటాయించడం ఒక్కటే తప్పనిసరి. ఒకరోజు అచ్చంగా లెక్కలు చేయాలనిపిస్తే లెక్కలే చేస్తుంటారు. స్కూల్లో చెప్పే సబ్జెక్టులన్నీ చదవడం ఇక్కడ తప్పనిసరి కాదు. పిల్లలు వాళ్లంతటవాళ్లు కొత్త సబ్జెక్టు గురించి తెలుసుకుని అడిగినప్పుడే అది బోధించడం మొదలెడతారు. సిద్ధాంతాలకన్నా ఆచరణకి ప్రాధాన్యమిస్తారు. ఈ పద్ధతి వల్ల మిగతా పనులకు సమయం సరిపోవడం లేదన్నది ఒక్కటే మా సమస్య అంటుంది సంగీత. ఒకరికన్నా ఇద్దరు పిల్లలుంటే ఈ పద్ధతి సులభమవుతోందంటారు కొందరు. ఐఐటిలో చదివినా సుందర్‌ మోత్వానికి తన బిడ్డలకు తానే చదువు చెప్పుకోవడం ఇష్టం. ఎవరేమనుకుంటే నాకేంటి అంటాడతను. ఇలా ఇంటిదగ్గర చదివిన పిల్లలు వారికి ఇష్టమైతే ఎప్పుడైనా మామూలు స్కూల్లో చేరవచ్చు. లేదా మానవవనరుల శాఖ ఆధీనంలో పనిచేస్తున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ నిర్వహించే పది, పన్నెండో తరగతి పరీక్షలు రాసి కళాశాలలో చేరవచ్చు. అలా చేరి డిగ్రీ కళాశాలలో ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం పొందింది గోవాకి చెందిన నదీషా. ఎంత బాగా నిర్వహిస్తున్నారన్న దాని మీద ఇంటి బడి విజయం ఆధారపడివుంటుందంటున్నారు ప్రత్యామ్నాయవిద్యావిధానం పట్ల ఆసక్తి కల విద్యావేత్త తారా కిని. పిల్లలు సమవయస్కులతో ఆడుకునే అవకాశం ఒక్కటే సంప్రదాయ విద్యావిధానంలో కన్పించే మేలని… ఇంటిబడి ప్రియులు ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలు మిగిలిన పిల్లలతో ఆడుకునేలా చూసుకోవాలంటారు. ప్రస్తుతానికి మనదేశంలో ఇంటిబడికి వెళ్తున్న వారి సంఖ్య వేలల్లోనే ఉన్నా అది పెరుగుతున్న వైనం, సంప్రదాయ విద్యావిధానం పట్ల తల్లిదండ్రులకు పెరుగుతున్న వైముఖ్యం… ఆలోచించాల్సిన అంశాలే కదా!
source : eenadu 2 july 2008

No Comments Yet

No comments yet.

Comments RSS TrackBack Identifier URI

Leave a comment